తాతగారింట్లో దీపావళి!!
Note :keertiSEshulu Wunnava venkaTappayya gaaru, jaanakammagaarla manavalu, manavaraaLLu ayina naa annalu akkalu... barampuram lO chaduvukOvaDam valla telugu chadavalEkapoyinaa meerandaruu telugu chadavaDam vacchina vadinalu, baavagaarla nE peLLi chEsukunnaaru kanuka vaaLLatO chadivinchukOnDi.
Note: కీర్తిశేషులు ఉన్నవ వెంకటప్పయ్య గారు, జానకమ్మగార్ల మనవలు, మనవరాళ్ళు అయిన నా అన్నలు అక్కలు... బరంపురం లో చదువుకోవడం వల్ల తెలుగు చదవలేకపొయినా మీరందరూ తెలుగు చదవడం వచ్చిన వదినలు, బావగార్ల నే పెళ్ళి చేసుకున్నారు కనుక వాళ్ళతో చదివించుకోండి.
ఆంధ్రా లో అమలాపురం లో ఉండే మేము ఏడాది కి ఒకసారి
ఒరిస్సా
లో బరంపురం లో ఉండే తాతగారి ఇంటికి వెళ్ళడం చాలా అబ్బురంగా ఉండేది.
ఎందుకంటే, అక్కడకి వెళ్ళడానికి తప్ప ఇంకెప్పుడూ రైలు ఎక్కి అంత దూర ప్రయణాలు చేసే అవకాశం లేదు కనుక!!
అప్పట్లో అమలాపురం లొ railway
reservation counter లేదు కనుక మా హనుమంత రావు బావ రాజమండ్రి
వెళ్ళి ఏ కోణార్క్కో, ఈస్ట్ కోస్ట్కో టిక్కెట్లు తీసుకురావడం తో మా ప్రయాణం మొదలు అయ్యేది.
ఆ తరువాత ఆమ్మ తాతగారికి మా ప్రయాణం గురుంచి ఉత్తరం వ్రాయడం, తిరుగు టపా లో మా రాకకు సంతోషిస్తూ, మా అమ్మమ్మ చేసే వంశ
పారంపార్య వైద్యానికి కావలసిన వస్తువుల జాబితాతో తాతగారు నుంచి ఉత్తరం రావడం, అమ్మ కొబ్బరికాయలు, మావిడి కాయలు ( మా ఇంటి చెట్లవి కనుక అవి స్పెషల్) మూటలు కట్టడం….టైము దగ్గర పడుతోంది అని హడావిడి పడటం, పెద్ద సందడే జరిగేది!!
బరంపురం బొడకిమిడి సాయి వీధి చివరన ఒక కిరాణా కొట్టులాంటిది ఉండేది….మేము ఎప్పుడు వస్తున్నామన్నా, తాతగారు తన పెద్ద కూతురు ‘పాప’ కోసం అక్కడ కూర్చుని ఎదురు చూసేవారు.
మా కోణార్క్ రైలు మాత్రం ఆయన ఎదురు చూపులకి అతీతంగా ఎప్పుడూ 3, 4 గంటలు ఆలస్యంగా వెళ్ళేది.
నిజం చెప్పాలంటే నాకు, మా అన్న కి బరంపురం వెళ్ళడం ఆంటే ఇష్టం ఉండేది కాదు, మాకు భాష రాదు అని!
నాకు మాత్రం రిక్షా లోంచి వీధి చివర కర్ర పట్టుకుని ఒక చిన్న స్టూల్ మీద కూర్చున్న తాతగారిని చూసేసరికి హుషారు వచ్చేసేది…మరి తాతగారు అక్కడ నాకొసం పిప్పర్మెంట్లు కొని చొక్కా జేబులొ వెసుకుని రెడీ గా ఉంటారని పెద్ద నమ్మకం!!
అదే కాక, జానకి నిలయం లో గేటు పక్క గా ఉండే సపోటా చెట్టు పళ్ళు, తాతగారుకి, నాకు ఎంతొ ఇష్టం అయిన పసుపు రంగు గులాబి చెట్టు పువ్వులు (ఆ రంగు గులాబి మొదట చూసింది తాతగారింట్లోనే) ఇవన్ని నాలో ఉత్సాహాన్ని నింపేవి.
దీపావళి అనగానే నాకు ఎందుకో అప్రయత్నం గా గుర్తు వచ్చేది మా తాతగారు!!
దసరా బరంపురం లో బాగా చేస్తారని ఎప్పుడూ దసరా కి తాతగారింటికి వెళ్ళే మేము ఒకసారి దీపావళి కి వెళ్ళాం.
ఈ సారి దీపావళి కి తాతగారింటికి గోవా నుంచి మా మంజు పిన్ని, తిరుపతి నుంచి మా బిజ్జు పిన్ని కూడా వచ్చారు.
మిగితా ముగ్గురు కూతుళ్ళు అయిన గున్ను పిన్ని, వేణు పిన్ని, అను పిన్ని ఆ వీధి లోనే ఉంటారు, మా ఒక్కగానొక్క మావయ్య అప్పుడు బరంపురం లోనే ఉద్యోగం కనుక తాతగారింట్లొనే ఉన్నాడు.
నాకు తెలిసి తాతగారి అందరు మనవళ్ళు కలిసింది అప్పుడే!! అప్పటికి అందరిలోను ఆఖరి వాడు అయిన విన్ని ఉరఫ్ మా మంజు పిన్ని కొడుకు ఇంకా పుట్టలేదనుకుంటా.
దీపావళి 15 రోజులు ఉంది అనగా మొదలు అయ్యిందిట తాతగారి హడావిడి.
అక్కడే ఉన్న మనవళ్ళతో చిచ్చుబుడ్లు, మతాబులు కూరించడం, కాకరపూవత్తులు ఎండపెట్టటం, చిన్న పిల్లల కోసం అగ్గిపెట్లు, తాళ్ళు వేరేగా దాచడం, పెద్ద కూతురు కి ఇష్టం అయిన వంటకాలు జాబితా ఏ పద్దెనిమిదోసారో అమ్మమ్మకి చెప్పి ఆవిడని హడలుగొట్టేయడం…..మేము వెళ్ళాకా అమ్మమ్మ వేసిన దోశెల టిఫిను తింటూ మా అమ్మ కి అమ్మమ్మ చెపుతూ ఉండగా వినగా తెలిసిన కబుర్లు.
దీపావళి 2 రోజులు ఉంది అనగా మనవలందరికి బాణాసంచా పంపకాలు మొదలయ్యాయి.
అందులో మళ్ళీ వయసు వారి గా కుడా పంపకాలు జరిగాయి…అంటే సాయి అన్న, వాసు అన్న, కిరణ్ అన్న లాంటి పెద్ద వాళ్ళకి బాంబులు, లక్ష్మి ఔట్లు, కాస్త చిన్న వయసు ఉన్న మా శంకరు అన్న, అనిల్ అన్న, రవి అన్న వాళ్ళకి చిచ్చుబుడ్లు, తాటాకు టపాకాయిలు, సతీష్ అన్న కి మరీ ఆటు ఇటు కాకుండ ఒక మోస్తరు పెద్ద చిన్న చిచ్చుబుడ్లు , ఇంక ఆటల్లో ఆరటిపళ్ళం అయిన నాకు,నాకంటే చిన్న వాళ్ళు అయిన రమేష్, విద్యల కి తాళ్ళు , అగ్గిపుల్లలు.
తాతగారింటి ఎదురు గానే మా వైజాగ్ మావయ్య, అత్త (బోడపాటి రామం గారు, రత్నం గారు)వాళ్ళు ఉండేవాళ్ళు.
రాజా, తమ్ము, బన్ని వాళ్ళ పిల్లలు.
ఈ సందడి లొ వాళ్ళు కూడా కలిసారు.
ఇంక దీపావళి నాడు మనవలందరి కీ నలుగు పెట్టి, కుంకుడి కాయ పులుసు తల స్నానాలతో హడావిడి మొదలు అయ్యింది.
మనవరాళ్ళల్లో పెద్దవాళ్ళు అయిన సంజని అక్క, పద్మజ అక్క వాళ్ళు చుడిధార్ వేసుకుని, శివుడి మెడలో పాము లాగ చున్ని మెడ చుట్టూ వేసుకుని , చక్కగా తయారు అయ్యారు.
అమలాపురం లో గౌన్లు, పరికిణీలు తప్ప వేసుకోని నాకు అప్పట్లొ వాళ్ళే fashion icons(అప్పుడే కాదు ఇప్పటికీ నిత్య యువ్వనం తో సంజని అక్క, పద్మజ అక్క మెరిసిపోతున్నారు)
అమ్మమ్మ, అను పిన్ని ఆధ్వర్యం లో – మా అత్త, మిగితా పిన్ని వాళ్ళు అందరూ కలిసి వంటిల్లు కి ఆనుకుని ఉన్న హాల్లో పిండి వంటలు చేస్తూ ఉంటే, ముందు గదిలో మా వాటా బాణాసంచా ని పదే పదే చూసుకుంటూ మేము, పెద్ద మనవలు అందరూ రాకెట్లు, తారజువ్వలు కాల్చడానికి సీసాలు వగైరా తయారు చేసుకుంటూ ఇల్లంతా గోల గోల గా ఉంది.
పిండి వంటల్లో ముఖ్యమైనవి – పెసరట్టుల కూర, బొబ్బట్లు, పెరుగు ఆవడలు, mysore
pak స్వీటు.
పాప అక్క(మా అమ్మ) తాతగారింట్లో వంట చేయగా నేనెప్పుడూ చూడలేదు, పాపం మిగితా చెల్లెళ్ళు అందరూ మా అమ్మ కి ఎందుకో మరి special
treatment ఇచ్చేవారు.
అయినా మా అమ్మ సేమ్యా పాయిసం , పులిహోర చేయడంలో మాత్రమే ఎక్స్పెర్టు, ఎందుకులే ఆవిడని కదపడం అనుకుని ఉంటారు.
మంజు పిన్ని గోవా కబుర్లు, కళ్ళకి కట్టినట్లు వర్ణించి చెప్పే గున్ను పిన్ని “నిజమైన”కధనాలు ఆ పిండి వంటలకి ఇంకాస్త రుచి చేకుర్చాయి.
ముందు తాతగారి కి అయిన రూం లో స్టూల్ మీద (ఆయన కింద కూర్చొలేరు కనుక) అమ్మమ్మ అన్నం పెట్టి వచ్చాక మిగితా వాళ్ళ భోజనాలు మొదలు అయ్యాయి.
మధ్యలొ తాతగారు ‘జానకి ‘అని పిలవగానే అమ్మమ్మ పరుగెత్తుకు వెళ్ళడం, కూతుళ్ళు అమ్మ ని నాన్నగారు కష్టపెట్టేస్తున్నారు అని విసుక్కోవడం, ఆ మాటలు విని అమ్మమ్మ ‘నా మొగుడు కి నేను చేసుకుంటూంటే మీకెందుకే గోల’ అని ఎదురు తిట్టడం చూసి తాతగారి మొహం మతాబులా వెలిగిపోయింది.
అప్పటికే అన్ని రకాల పిండి వంటలని తినలేక వదిలేయలేక చిన్న సైజు బొజ్జ గణపతి లా తయారయ్యిన మాకు మళ్ళీ మధ్యహ్న్నం మావయ్య గిరిజ చౌక్ దగ్గర నుంచి తెవ్చిన రసగుల్లాలు, సింగడాల తో ఆరగింపు జరిగేది.
అసలే రసగుల్లాలు మా అమలాపురం లో దొరకవు, నాకేమో చాలా ఇష్టం, అలా అని తినలేను, వదలలేను, పైకి చెప్పుకొలేను .
పైగా అప్పట్లొ నాకు అమ్మ తో మాట్లాడటానికి కూడా తెగని మొహమాటం.
ఎలా తెలుసుకుందో ఏమో అమ్మమ్మ నా అవస్థ….నా పరిస్థితి చూసి నా వాటా వచ్చిన రసగుల్లాలో ఇంకొకటి ఎక్కువ వేసి వంటింట్లో అరలో దాచి పెట్టింది మర్నాడు నాకు పెట్టడం కోసం!!
ఇంక సాయింత్రం అయ్యేసరికి దీపాలు వెలిగించడం తో అసలు పండగ మొదలు అయ్యింది.
ఈ లొపు వాటాలలొ వచ్చిన మందు సామానుల లెక్క గల్లంతు అయ్యేది……ఒకరి సామాన్లు ఇంకొకరు ఎవరూ చూడకుండా తీసుకుని కాల్చేస్తూ ఉండటం వల్లన!!
నాకు బాగా గుర్తు--- మా రాజేష్ అన్న, శంకరు అన్న మా చిన్నపిల్లల కి కాల్చడం నేర్పిస్తాము అని వాళ్ళే మతాబులు, కాకరపూవత్తులు కాల్చేసారు
ఇంక తమ్ము వాళ్ళు, మా పెద్ద అన్న లు టపాకాయిలు, ఔట్లు కాలుస్తు ఉంటే చిన్న అన్నలు మేము కాలుస్తాము అని సరదా పడి, వాళ్ళని బతిమాలి, పెద్ద వాళ్ళు చూడకుండా కాల్చారు.
ఈ లోపు ఎవరో అది చూసి మా మావయ్య కి చెప్పారు….అప్పుడు మా మావయ్య తిట్లేమో టపాకాయిలు కన్నా ఎక్కువ మోత….పిల్లలెమో ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చిప్!!
అప్పుడు తీరిగ్గా మావయ్య వచ్చి చిచ్చుబుడ్లు వరుసగా వెలిగిస్తూ, మళ్ళి తనే మాయం అయిపొయిన మేనళ్ళుళ్ళందరిని పేరు పేరునా పిలుస్తూ వాళ్ళ చేత టపాకాయిలు , లక్ష్మి ఔట్లు దగ్గరుండి కాల్పించాడు.
మొత్తానికి బొడకిమిడి శాయి వీధి అంతా వెంకటప్పయ్య గారి ఇంట్లో దీపావళి సందడి తో నిండిపోయింది.
ఆది చూసి మా మంచి తాతాగారి కళ్ళల్లో
వేయి చిచ్చుబుడ్లు వెలిగిపొయాయి, ఆ వెలుగు ల కాంతి లో మా అమ్మమ్మ నుదుటి బొట్టు మెరిసిపోతూ, అమావాస్య రోజున రాని చంద్రుని లోటు తీర్చింది.
దీపావళి తరువాత రెండు రోజుల కి తిరుగు ప్రయాణం.
అన్నట్లు, వచ్చేస్తున్నప్పుడు కూడా తాత గారు వీధి చివర కొట్టు లో పిప్పర్మెంట్లు తో పాటు, నేను ప్రతి ఏడాది పెట్టుకునే బొమ్మల కొలువు కి తను స్వయం గా రంగులు వేసిన బొమ్మలు కానుక గా ఇచ్చారు.
ఆ తరువాత సంవత్సరానికో, ఆ పైన వచ్చిన ఏడాదికో సరిగ్గా దీపావళి కే తాతగారు స్వర్గంలో వాళ్ళకి మతాబులు, చిచ్చుబుడ్లు చేయడానికి కాబోలు తొందరపడి వెళ్ళిపోయారు.
కాని నా చిన్ని మనసులో ఆనాటి దీపావళి ఒక అందమైన జ్ఞాపకం గా ఎప్పుడూ వెలుగులు కురిపిస్తునే ఉంది, తాతగారి దీవెనలు అందిస్తునే ఉంది.
P.S: Inspired by sri.Jawaih mavayya's blogs :-)